నామకరణం

30 12 2008

నమస్కారం!
బ్లాగు నామకరణ టపాను చదవడానికి విచ్చేసినవారందరికీ పేరు పేరునా స్వాగతం. పెద్ద పెద్ద కవులకు, రచయితలకు, కలం పేరు లాగా, చిన్న బ్లాగరినైన నాలాంటి వాళ్ళు కూడా కీబోర్డు పేరు లాంటివి వాడటం బావుంటుందని ఈ నామకరణ మహోత్సవాన్ని సంకల్పించాను.
సంకల్పం. అస్సలు కష్టం లేని పని. త్వరగానే అయిపోయింది. కానీ, ఏం పేరు పెట్టాలో చాలా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. మొదటగా, గుఱ్ఱం జాషువా గారి గిజిగాడు గుర్తుకు వచ్చింది. అంతటి నైపుణ్యం ఉన్న గిజిగాడితో నాకు పోలికా…? అమ్మో, ఆ పేరుకు తగ్గట్టుగా నా బ్లాగును తీర్చిదిద్దాలంటే, చాలా కష్టం. అంత శ్రమ నా వల్ల కాదని, మరో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాను.
మరో కోణం. నాకు అట్లాంటి గొప్ప పేర్లు సరిపోవని నిర్ణయించాక, హాస్యప్రధానంగా వుండాలని, ఆ కోణంలో ఆలోచించాను. బంకు శీను, గాలి శీను, బొట్టు శీను… ఛీ ఛీ.. ఒక పేరన్నాక దానికి ఒక మంచి కారణం ఉండాలి కానీ మరీ ఇలా గాలి పేర్లొద్దు.
సరే, ఇలా కుదరదు అని అనుకుంటుండగా, హాస్యంలో పౌరాణికాలను కూడా వాడుకుంటూ హాస్యాన్ని అత్యద్భుతంగా పండిస్తూనే జనం మరచిపోతున్న కథలను గుర్తు చేసిన జంధ్యాలగారు గుర్తుకు వచ్చారు. ఆయన సినిమాల్లో కొన్ని తిట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉదాహరణకి, “లారీ టైరుకి నోటితో గాలి ఊదేవాడి మొహమూ నువ్వూను”, “నువ్వు టీవీ మహభారతంలో దుర్యోధనుని 93వ తమ్ముడిలాంటి వాడివి రా, నీ ఫేస్ కూడా జనానికి తెలీదు” లాంటివన్నమాట. అబ్బ. ఎంత బావుందో కదా! దుర్యొధనుని 93వ తమ్ముడు. అద్గది. ఈ పేరేదో బావుంది. కాని, “హింసించే రాజు, 23వ పులకేశి” లాగా, ఎన్ని రోజులని 93వ తమ్ముడిని అని చెప్పుకోవాలి? ఇలా కాదు. ఆ పేరేదో కనుక్కోవాలి. మహాభారతం ఈ-బుక్ డౌన్లోడ్ చేశాను. ఎన్ని రోజులు చదవాలో అనుకుంటుండగా. నా మిత్రుడు, ఇలాంటి వాటికి మన Wiki ఉందని గుర్తు చేశాడు. అద్ది. అప్పుడు దొరికిందండీ పేరు. ప్రమతి. పేరు బానేవుంది. మరీ దుశ్శాసనుడు, దుర్ముఖుడు అని కాకుండా.
ఇదండీ. ఈ రోజు టపా. ఆయాసం వచ్చేంతటి ఈ ప్రయాస, ఈ పేరు ఎలా ఉన్నాయి?

ప్రమతి





మొట్టమొదటి టపా

26 12 2008

తెలుగు బ్లాగరులారా! నమస్కారం.
చాలా మంది తెలుగు బ్లాగరులను  చూసి, నేను కూడా నాకు నచ్చినవీ, నచ్చనివీ, ఒకటేమిటి, అన్నీ ఒక చోట తెలుగులో రాద్దామని, ఈ బ్లాగును మొదలుపెడుతున్నా. అక్కడికి నేనేదో కవితలూ గట్రా రాసేద్దామని కాదు. అలాంటివి రాకపోయినా, ఇంకొకళ్ళు రాసిన వాటి మీద కామెంట్రీలు లాంటివి స్వతహాగా చేతనవ్వడం, వ్రాయటం మర్చిపోయిన తెలుగులో గుర్తున్నది రాసుకోవడం, ఈ బ్లాగు మొదలెట్టడానికిగల కారణాలు.

అంతే కాదండొయ్! “ప్రతి మనిషికీ తన గురించే కాకుండా, తన అభిప్రాయాలను గురించి అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం.” కాబట్టి, నేను రాసే విషయాల గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఈ బ్లాగు యొక్క అతి ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి, మీ అభిప్రాయాలను, కొట్టొచ్చినట్టు తెలుపవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన WordPress వారికీ, lekhini.org వారికీ కృతఙ్ఞతలు తెలుపుకుంటూ,

రవి హర్ష








Follow

Get every new post delivered to your Inbox.